Matthew 23

పరిసయ్యుల ఆగడాలు (మార్కు 12:38-40. లూకా 20:45-47)

1అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు, 2“ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు 3కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు.

4మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు.

5వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు.

6విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు.

7సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం.

8మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు. 9ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి. 10అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.

11మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి. 12తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
కొన్ని ప్రాచీన ప్రతుల్లో, “ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరొక పక్క దీర్ఘప్రార్థనలు చేస్తూ విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటారు. కాబట్టి మీకు మరింత గొప్ప శిక్ష కాచుకొని ఉంది” అని రాసి ఉంది.

పరిసయ్యులకు యాతన (మార్కు 12:38-40. లూకా 20:47)

13“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు. 14మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు.

15అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు.

16“అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు.

17బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా?

18అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు.

19అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా?

20బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. 21అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. 22ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.

23“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.

24అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమల్ని వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు.

25అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి.

26గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.

27అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి. 28అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు.

29“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు.

30‘మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసే వాళ్ళం కాము’ అని చెప్పుకొంటారు. 31నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.

32ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి.

33“సర్పాల్లారా, పాము పిల్లల్లారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు.

34కాబట్టి వినండి! నేను మీ దగ్గరికి ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు. సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు.

35నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది. 36అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

యెరూషలేముకై విలాపం (లూకా 13:34,35)

37“యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు. 38ఇదుగో, ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను ఇప్పటి నుండి మీరు ‘ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతులు పొందుతాడు గాక’ అని చెప్పే వరకూ మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను.”

39

Copyright information for TelULB